శ్రీవిష్ణు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే అందులో ఏదో ఒక కొత్తదనం ఉండే ఉంటుంది. కథ కొత్తగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీవిష్ణు అంగీకరిస్తాడు. మరి భళా తందనాన సినిమాలో అలాంటి కొత్తదనం ఏముంది? ఈ విషయాన్ని స్వయంగా ఈ నటుడు బయటపెట్టాడు. తన తాజా చిత్రం భళా తందననాలో క్లయిమాక్స్, ఎవ్వరి ఊహకు అందని విధంగా ఉంటుందని చెబుతున్నాడు.
“ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ కు వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కె.జి.ఎఫ్. వంటి అంత పెద్ద సినిమాలో చేసిన గరుడ రామ్ నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు.”
కేవలం క్లయిమాక్స్ పార్ట్ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట శ్రీవిష్ణు. అటు నిర్మాత సాయికొర్రపాటికి కూడా అదే నచ్చిందని చెబుతున్నాడు. ఇప్పటివరకు తను చాలా పాత్రలు పోషించానని, కానీ కామన్ మేన్ పాత్ర పోషించలేదని అంటున్నాడు శ్రీవిష్ణు.
“భళా తందనాన సినిమాలో నాది కామన్ మేన్ పాత్ర. అలా సాదాసీదాగా ఉండే ఓ వ్యక్తి ఒక్కసారిగా ఉగ్రరూపం ఎందుకు దాల్చాడు. వెయ్యి కోట్ల వ్యవహారంలోకి ఎలా ఎంటరయ్యాడు అనేది ఈ సినిమా కథ. నా పాత్రలో మాస్ ఎలిమెంట్స్ కనిపించవు. ఆ పాత్ర చిత్రణలోనే మాస్ యాంగిల్ కనిపిస్తుంది. ఓ సాధారణ వ్యక్తి హీరోగా మారడం అనేది మనకు తెలిసి అతిపెద్ద మాస్ యాంగిల్.”
ఈరోజు థియేటర్లలోకి వచ్చింది భళా తందనాన సినిమా. క్యాథరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు.