కెరీర్ స్టార్టింగ్ లో మంచి ప్రయోగాలు, కాన్సెప్ట్ కథలు ఎంచుకున్నాడు శ్రీవిష్ణు. అతడి సినిమాలకు ఆడియన్స్ లో స్పెషల్ ఇమేజ్ ఉండేది. ఇప్పుడు కూడా అతడు మంచి కథలే ఎంచుకుంటున్నాడు. కానీ.. అవి ప్రేక్షకులకు రీచ్ అవ్వడం లేదు. మరోవైపు శ్రీవిష్ణు కూడా తన పంథా మార్చినట్టు కనిపిస్తోంది. తాజాగా అతడు చేస్తున్న సినిమా చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.
కెరీర్ లోనే తొలిసారిగా పక్కా మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఆ సినిమా పేరు అల్లూరి. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో ‘నిజాయితీకి మారుపేరు’ అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ హీరో పాత్రని సూచించేలా ఉంది. ఈ పాత్ర కోసం శ్రీవిష్ణు పూర్తిగా మేకోవర్ అయినట్టు కనిపిస్తోంది. ఖాకీ యూనిఫాంలో చేతిలో తుపాకీ పట్టుకుని డాషింగ్ గా కనిపిస్తున్నాడు. వర్షంలో చేతిలో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో నడుస్తూ రావడం స్టన్నింగా ఉంది. సిన్సియర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న అల్లూరి ఫస్ట్ లుక్ ఎట్రాక్ట్ చేసేలా ఉంది.
దర్శకుడు ప్రదీప్ వర్మ నిజాయితీ గల ఒక పోలీసు కథ చెప్పడానికి చాలా రీసెర్చ్ చేశాడట. ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన రోజు మొదలైన ప్రయాణంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అతను చేసే త్యాగాలు, తన ఆలోచనలతో మొత్తం డిపార్ట్‌మెంట్ లో పెద్ద మార్పును ఎలా తీసుకొచ్చాడు లాంటి అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారట.
అంతా బాగానే ఉంది కానీ, మాస్-యాక్షన్ క్యారెక్టర్లు శ్రీవిష్ణుకు సూట్ అవుతాయా అనేది డౌట్. ఇంతకుముందు భళా తందనాన సినిమాలో ఓ షేడ్ లో యాక్షన్ లుక్ లో కనిపించాడు శ్రీవిష్ణు. అది పెద్ద ఫ్లాప్ అయింది. ఇప్పుడు అల్లూరితో ఫుల్ లెంగ్త్ యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు.