సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, టైటిల్స్ విషయంలో మాత్రం శ్రీవిష్ణు ఎప్పుడూ సూపర్ హిట్టే. టైటిల్ తో ఎట్రాక్ట్ చేయడం అతడికే చెల్లింది. అతడి సినిమా టైటిల్స్ అన్నీ భలేగా ఉంటాయి. ఇట్టే ఎట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు కూడా అలాంటిదే మరో క్యాచీ టైటిల్ తో మనముందుకొచ్చాడు ఈ హీరో. శ్రీవిష్ణు కొత్త సినిమా పేరు అల్లూరి.
అల్లూరి అనగానే అందరికీ ఆర్ఆర్ఆర్ గుర్తొస్తుంది. ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించాడు. ఇప్పుడా క్యారెక్టర్ ను గుర్తుచేస్తూ అల్లూరి అనే పదాన్ని టైటిల్ గా పెట్టేశాడు శ్రీవిష్ణు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమా ప్రీ లుక్ ను రవితేజ విడుదల చేశారు. టైటిల్ లోగోలో రెండు తుపాకులు కనిపిస్తున్నాయి. విష్ణు ముఖం కనిపించనప్పటికీ, శ్రీవిష్ణు ఖాకీ దుస్తుల్లో కనిపిస్తున్నాడు. యూనిఫామ్ లో కనిపించిన విధంగా సినిమాలో అతని పేరు ఎ.ఎస్. రామరాజు. అల్లూరి సీతారామరాజుకు షార్ట్ కట్ అన్నమాట.
శ్రీవిష్ణు సరసన కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అల్లూరి షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.