బిగ్‌బాస్‌లో ఆ ముగ్గురికే అత్యధికం
వంద రోజుల ‘షో’ కోసం ఎన్ని రోజులు బిగ్‌బాస్ ఇంట్లో ఉంటారో తెలీకపోయినా మొత్తంగా వందరోజుల పాటు డేట్స్ ఇచ్చేసినట్టు ఫీలయ్యే వారికి రెమ్యూనరేషన్స్ ఎలా చెల్లిస్తారు? ఇంతవరకూ నడిచిన రెండు సీజన్లకు ఎంతిచ్చారు..? ఇప్పుడు మూడో సీజన్ సెలబ్రిటీలకు ఎంతిస్తున్నారు? ఇదీ ఇప్పుడు టాపిక్..
‘స్టార్ మా’ ఛానల్లో వస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్‌గా సినిమా, టీవీ, సోషల్ మీడియా సెలబ్రిటీలు పాల్గొంటుంటారు. అదందరికీ తెలుసు. మరి ఆ సెలెబ్రిటీలకు ఇచ్చే పారితోషికాల గురించి తెలుసా.. అంటే చాలామందికి అవన్నీ తెలియని సంగతులు. విషయానికొస్తే.. బీబీ గత మూడు సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న అందరిలో ఎక్కువగా గిట్టుబాటు అయ్యింది వేళ్ల మీద లెక్కించేంత మందికే. ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసింది చాలా తక్కువమందికే. బయటకొచ్చిన వార్తల ప్రకారం ఓ ముగ్గురు టాప్ 3 జాబితాలో ఉన్నారు. సీజన్ వన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న సీనియర్ నటుడు సమీర్‌కు హౌస్‌లో ఉన్న ప్రతి వారం రోజులకు పది లక్షల చొప్పున పారితోషికం ముట్టినట్టు భోగట్టా. ఆ తర్వాత స్థానంలో సీజన్ 3లో స్ట్రాంగ్ పార్టిసిపెంట్ అనిపించుకుని వెళ్ళి కేవలం ఒకే ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిపోయి ఇంటి నుంచి బయటపడ్డ సీనియర్ నటి, లేడీ కమెడియన్ హేమ. ఈమె పారితోషికం వారానికి రూ.9.7 లక్షలని సమాచారం. ఈ ఇద్దరూ కాకుండా మరో కుర్ర లేడీ కళ్ళు చెదిరే పారితోషికంతో బిగ్‌బాస్ హౌస్ సీజన్ 3లో ఆదుగెట్టిందట. తనెవరో కాదు.. బుల్లితెరపై తనదైన స్టయిల్లో చలాకీగా మాట్లాడుతూ.. టాప్ యాంకర్ స్థానాన్ని సంపాదించిన శ్రీముఖి. బుల్లితెరపై ఏ ఛానల్లో చూసినా ఆమె కనిపిస్తోంది. అందుకే శ్రీముఖిని బహుముఖి అని చెబుతుంటారు. ప్రస్తుతం హౌస్‌లో టైటిల్ విన్నర్ పోటీలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి పారితోషికం ఏకంగా వంద రోజులకు గాను అక్షరాలా మూడు కోట్ల రూపాయలని తెలుస్తోంది. అంటే తనకు రోజుకు మూడు లక్షల రెమ్యూనరేషన్ అన్నమాట. సో, ఇప్పటివరకూ స్టార్ మా నిర్వహిస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 1, 2, 3 లలో అందరికంటే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి ముగ్గురు వరుసగా శ్రీముఖి, సమీర్ అండ్ హేమ అన్నమాట!