నెల్లూరు : వాహనాలకు సంబంధించి ఎన్ని రూల్స్ పెట్టినా స్కూల్స్ యాజమాన్యాలు పట్టించుకోవు. ఆర్టీఏ యంత్రాంగం కూడా చూసీ చూడనట్టు వదిలేస్తుంటుంది. స్కూల్ బస్సులు కండిషన్‌లో వున్నాయా, లేదా.. డ్రైవర్లు ఎలావున్నారు… అని చెక్ చేసుకోకుండా రోడ్డెక్కిస్తే పసి పిల్లల ప్రాణాలు మీదకు వస్తుంది. నెల్లూరులో అదే జరిగింది.
నెల్లూరు జిల్లా వేంకటగిరిలో జరిగిన ప్రమాదం స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. శ్రీ చైతన్య స్కూల్ బస్ బోల్తా పడింది. అందులో వున్నా పిల్లల్లో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అక్కుడున్న స్థానికులు వెంటనే స్పందించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ ఎందుకు జరిగింది.. అని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టలేదు. డ్రైవర్ మద్యం తాగి బస్ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులకు అర్ధం అయ్యింది. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని డక్కిలి మండలం కుప్పాయిపాలెం సమీపంలో శ్రీ చైతన్య స్కూలుకు చెందిన ఈ బస్ మామూలుగానే పిల్లల్ని ఎక్కించుకుని వెళ్తోంది. డ్రైవర్ తాగి బస్సు నడపడానికి ధైర్యం చేశాడు. దాంతో ఈ ప్రమాదం తప్పింది. తల్లిదండ్రుల అదృష్టం కొద్దీ జరగరానిది ఏదీ జరగలేదు కాబట్టి సరిపోయింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ తెగ హడావిడి చేసే పోలీసులు కానీ, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన స్కూల్ యాజమాన్యం కానీ ఇది గమనించకపోవడం చాలా ఆశ్చర్యకరమయిన విషయం. పిల్లలు గాయాలతో బయటపడ్డారు కానీ, లేకపోతే తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్పగలిగేవారు?
కండిషన్‌లో లేని కాలం చెల్లిన బస్సులు, ఓవర్లోడ్, రాష్ డ్రైవింగ్.. ఇవన్నీ పసిపిల్లలకు ప్రాణాంతకాలని వీళ్లు ఎప్పుడు గుర్తిస్తారో… కానీ.. ఏదో ఒక ప్రమాదం జరగడం, ఆ కాసేపు RTA అధికారులు హడావుడి చెయ్యడం… మళ్ళీ వదిలేయడం.. ఇదొక సర్వసాధారణమైన తంతుగా మారింది.