తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుపోయిన శ్రీలంకలో ప్రజా నిరసనలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలను ఉధృతం చేశారు. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసినా ఆందోళనకారులు వెనక్కుతగ్గడం లేదు. ఈ నిరసనల్లో భాగంగా మాజీ కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను చుట్టుముట్టిన నిరసనకారులు కార్లను ఎత్తి నదిలోకి తోసేశారు. ఆ సమయంలో ఆ కార్లలో ఎవరూ లేరు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతేకాదు, దేశవ్యాప్తంగా పలు చోట్ల మహీంద క్యాబినెట్‌లోని మంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతల నివాసాలు, వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. అయితే, ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగాక హింస మరింత ప్రజ్వరిల్లుతోంది. సోమవారం వరకూ ప్రశాంతంగా కొనసాగిన నిరసనలు.. ప్రధాని రాజీనామాతో హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది.
ఇప్పటికే ఎమర్జెన్సీ కొనసాగుతుండగా.. నిరసన జ్వాలలు ఎగిసిపడటంతో సైన్యం, పోలీసులకు విశేష అధికారాలను కట్టబెడుతూ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స మద్దతుదారులు దాడులు చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడా నిరసనకారులపై తమ ప్రతాపం చూపారు. దీంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. అధికారంలో ఉన్న పలు ఎంపీల ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు.
ఈ హింసాత్మక ఘటనల్లో ఎంపీ, ఆయన భద్రతా అధికారితోసహా 9 మంది మరణించారు. 250 మందికిపైగా గాయపడ్డారు. కొలంబోలోని ప్రధాని అధికార నివాసాన్ని కూడా తగలుబెట్టేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో 10 పెట్రోల్ బాంబులను విసిరినట్టు పోలీసులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేత, 73 ఏండ్ల రణిల్ విక్రమ సింఘే ఐదోసారి శ్రీలంక ప్రధానిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో లంకేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, కాల్పులు జరపడంతో వారు ఆందోళనను పెంచారు.
In Sri Lanka, Anger over the cost of living the public threw politicians' cars into the waters.
— 🥀_Imposter_🕸️ (@Imposter_Edits) May 11, 2022
Advertisements