శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. క్షీణించిన విదేశీ మారక నిల్వలు, ఆహారం, ఇంధన కొరతతో శ్రీలంక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర దేశాల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.’
ఈ క్రమంలో తమ దేశానికి భారత్ సహాయం చేయాలని అక్కడి నేతలు కోరుతున్నారు. తాజాగా తమ దేశానికి వీలైనంత ఎక్కువగా సహాయం చేయాలని ప్రధాని మోడీని శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస కోరారు.
‘ శ్రీలంకకు వీలైనంత ఎక్కువగా సహాయం చేయండి. దయచేసి దీని కోసం ప్రయత్నించండి. ఇది మా మాతృభూమి. దీన్ని కాపాడుకోవడం మా బాధ్యత’ ఆయన ప్రధాని మోడీని కోరారు.
అంతకు ముందు శ్రీలంక మంత్రుల రాజీనామాను ఆయన ఓ డ్రామాగా అభివర్ణించారు. దేశానికి ఉపశమనం కలిగించేందుకు రాజీనామాలు చేయడం సరైన ప్రయత్నం కాదన్నారు.
రాజీనామాలతో ప్రజలను మంత్రులు మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. తన ప్రజలకు ఉపశమనం కలిగించే “పాత్ బ్రేకింగ్ మార్పు” ను దేశం కోరుకుంటోందన్నారు. నాయకులు ఎప్పటికప్పుడు వారి స్థానాలను మార్చుకునేందుకు రాజకీయం అనేది కుర్చిలాట కాదన్నారు.