ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రతి రోజూ 10 గంటల విద్యుత్ కోతను విధించనున్నారు. ఈ విద్యుత్ కోతలను బుధవారం నుంచి విధించనున్నట్టు ఆ దేశ ప్రజా వినియోగ కమిషన్ వెల్లడించింది.
‘ దేశంలో సరిపడా జనరేటర్ల అందుబాటులో లేకపోవడం, చమురు కొరతల కారణంగా సరిపడా విద్యుత్ ను ఉత్పత్తిని చేయలేకపోతున్నందున నిర్వహణపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది ‘ అని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
చమురు కొరతతో పాటు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో గత ఫిబ్రవరి నుంచి దేశం విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నట్టు బోర్డు పేర్కొంది.
మరోవైపు బుధ, గురు వారాల్లో దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడనుందని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ వెల్లడించింది. అందువల్ల మార్చి 30,31 తేదీల్లో పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టవద్దని తెలిపింది.
కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో పర్యాటక రంగ ఆదాయం దెబ్బతింది. ప్రస్తుతం శ్రీలంక విదేశీ మారక కొరతను ఎదుర్కొంటోంది. దీంతో అది చమురు, విద్యుత్, గ్యాస్ కొరతకు దారి తీసింది. ప్రస్తుతం ఇతర దేశాల ఆర్థిక సాయం కోసం శ్రీలంక ఎదురు చూస్తోంది.