శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. ఆయనతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి కూడా అధ్యక్షుడికి తన రాజీనామా లేఖను పంపారు.
ఇటీవల శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దేశ అధ్యక్షుడు, ప్రధాని తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మహేంద్ర రాజపక్సే తన పదవికి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో దేశంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆందోళన కారులపై ప్రభుత్వ అనుకూల వర్గాలు దాడికి దిగాయి.
దీంతో వారిపై సైన్యం టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ ను విధించింది. దేశ రాజధానిలో అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది.