శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ఆ దేశ ప్రధాని రాణిల్ విక్రమ సింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల దేశం విడిచి పారిపోయిన తర్వాత గొటబాయ రాజపక్సే తన రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ కు పంపారు. ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో అధ్యక్ష స్థానం ఖాళీ కావడంతో తాత్కాలిక అధ్యక్షునిగా విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు.
నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని ప్రధాని విక్రమసింఘే నిర్వర్తిస్తారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శ్రీలంక పార్లమెంట్ బుధవారం సమావేశం కానుంది. నూతనంగా ఎన్నికయ్యే అధ్యక్షుడు 2024 వరకు పదవిలో కొనసాగనున్నారు.
నూతన అధ్యక్ష రేసులో విక్రమసింఘే, అలాగే ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస, మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమ పేర్లు ప్రముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తనపై చాలా మంది ఎంపీలు ఒత్తిడి తెస్తున్నారని మాజీ ఆర్మీ కమాండర్, ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా చెబుతున్నారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకాభిప్రాయానికి కృషి చేయాలని ఎంపీలను ప్రధాని విక్రమసింఘే కోరారు. ప్రధానిగా తాను రాజ్యాంగ ప్రక్రియను అనుసరిస్తానని అన్నారు. దేశంలో శాంతిభద్రతలను పూర్వ స్థితికి తీసుకు వచ్చేందుకు పూర్తిగా కృషి చేస్తానని వెల్లడించారు.