ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను గట్టెక్కించడం కోసం ఆ దేశ నూతన ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ చేసే ప్రయత్నంలో అప్పులను తీర్చడం కోసం జాతీయ విమానయాన సంస్థను ప్రయివేట్ పరం చేయాలని భావిస్తోంది. 2021 మార్చి చివరి నాటికి శ్రీలంక ఎయిర్ లైన్ కు $124 మిలియన్ల మేర నష్టాలున్నాయని ప్రధాని రణిల్ విక్రమ సింఘే తెలిపారు.
ఎయిర్ లైన్స్ ను ప్రయివేటీకరించిన తర్వాత కూడా నష్టాలను భరించాల్సి ఉంటుందన్న విక్రమసింఘే.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విమానం ఎక్కని నిరుపేదలు ఈ నష్టాలను భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో శ్రీలంక లేదని.. జీతాలిచ్చేందుకు నోట్లను ముద్రించాలని నిర్ణయించినట్టు విక్రమసింఘే స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో శ్రీలంక కరెన్సీపై ఒత్తిడి పడే ప్రమాదం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ముందు మరో దారి లేదని తెలిపారు.
Advertisements
శ్రీలకంలో ప్రస్తుతం ఒక్క రోజుకు సరిపడా మాత్రమే గ్యాసోలిన్ నిల్వలు ఉన్నాయని సింఘే తెలిపారు. ఓపెన్ మార్కెట్లో డాలర్లను పొందడం ద్వారా క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి తమ జలాల్లో వేచి ఉన్న మూడు నౌకలకు చెల్లింపులు చేయాలని భావిస్తున్నట్టు సింఘే వెల్లడించారు.