తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితి కారణమంటూ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో ప్రజల తీవ్ర వ్యతిరేకతల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని మహేంద్ర రాజపక్సే తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు.
దీంతో దేశంలో పరిస్థితులు సద్దుమణుగుతాయని అంతా భావించారు. కానీ నిరసన జ్వాలలు చల్లారడం లేదు. మంగళవారం జరిగిన ఘర్షణలో సుమారు 8 మంది పౌరులు మరణించారు. దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారు.
ఓ వైపు కర్ఫ్యూ విధించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ నేతల, మద్దతుదారుల ఇండ్లపై దాడులకు దిగుతున్నారు. వారి వ్యాపారాలపై కూడా ఆందోళన కారులు దాడులు చేస్తున్నారు. దీంతో అల్లర్లను ఆపేందుకు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎవరైనా ప్రజా ఆస్తులకు ధ్వంసం చేస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తూ కనిపిస్తే వారిని వెంటనే కాల్చి వేయాలని సైన్యానికి రక్షణ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సైన్యానికి ప్రత్యేక అధికారాలను రక్షణ మంత్రిత్వశాఖ ఇచ్చింది.