శ్రీలంక లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల ఆగ్రహాం కట్టలు తెంచుకోవడంతో ఒక్కసారిగా లంక అధ్యక్షభవనం పైకి దాడికి దిగిన సంగతి తెలిసిందే. దాడులు జరుగుతాయని ముందే పసిగట్టిన అధ్యక్షుడు గొటబాయ రాత్రికి రాత్రే పారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించేందుకు శ్రీలంకలోని వివిధ రాజకీయ పార్టీలు గత రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. వచ్చే వారం పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్ మహీంద ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అంతకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలు కలిసి తీసుకున్నారు.
అసలు అయితే జూన్ 13న గొటబాయ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రధాని రణిల్ విక్రమసింగ్‌కు కూడా అధికారికంగా తెలిపారు. శనివారం అధ్యక్ష భవనంపై దాడి అనంతరం గొటబాయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రాజపక్స రాజీనామా సమర్పించగానే, అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. 15న పార్లమెంటు సమావేశమై.. అధ్యక్ష పదవి ఖాళీని అధికారికంగా ప్రకటిస్తుంది. 19న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నిక జరుగుతుంది.
శ్రీలంక రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే.. గరిష్ఠంగా 30 రోజుల వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ కొనసాగవచ్చు. ఆలోపు పార్లమెంటు.. తమ సభ్యుల్లో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. గొటబాయ పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉంది. కాబట్టి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు కూడా ఆ రెండేళ్లే.. పదవిలో కొనసాగుతారు. నూతనంగా ఏర్పడే అఖిలపక్ష ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ ప్రకటించింది.
ప్రస్తుత మంత్రిమండలి కూడా.. తాత్కాలిక అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం కుదిరిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేస్తామని పేర్కొంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారాలకు స్పీకర్ కార్యాలయం కత్తెర వేసింది. అజ్ఞాతం నుంచే ఆయన ఆదివారం నేరుగా అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఇక నుంచి అధ్యక్ష ఉత్తర్వులు స్పీకర్ కార్యాలయం నుంచే విడుదలవుతాయని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
మేము ఎవర్ని పంపడం లేదు:
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను అణచివేయడానికి భారత్ సైన్యం పంపనుందని శ్రీలంకలోని కొన్ని టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను కొలంబోలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వదంతులు రావడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి.