శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే విధించారు. దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెరిగి శాంతి భద్రతలు అదుపుతప్పుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడం గత ఐదు వారాల్లో ఇది రెండో సారి కావడం గమనార్హం. దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత పెరుగుతుండటంతో అధ్యక్షుడు రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు దిగాయి.
ఈ క్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు పార్లమెంట్ ముట్టడికి శుక్రవారం ప్రయత్నించారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు సైన్యం టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ఉపయోగించింది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
పరిస్థితులు చేయి దాటిపోతున్నట్టు ప్రభుత్వం గ్రహించింది. దీంతో దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న దృష్ట్యా ఎమర్జెన్సీ విధించినట్టు అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు