శ్రీలంక దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో విలవిల్లాడుతోంది. నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరలు ఆకాశన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోన్నారు. రోడ్లపైకి వచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఇటీవల కొలంబోలోని పార్లమెంటు భవనం ముందు అండర్ వేర్లతో యువత ధర్నా నిర్వహించారు. రాజపక్సే పాలనలో తమకు ఇవి కూడా మిగిలేలా లేవంటూ నినాదాలు చేస్తున్నారు.
ముఖ్యంగా దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహిందా రాజపక్సేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఇక ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఆదివారం అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధించారు.
ఇక ఇదిలా వుంటే ప్రధాని మహిందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలతో పాటు సొంత క్యాబినెట్‌లోని కొంతమంది మహిందా రాజపక్సేను రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో దేశంలో ఆందోళనలు తగ్గించేందుకు ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే, అధ్యక్షుడు గొటబాయ సూచన మేరకు మహింద సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తన రాజీనామా వల్ల దేశంలో ఎంతోకొంత ఆందోళనలు తగ్గే అవకాశం ఉందని రాజపక్సే సర్కార్ భావిస్తోంది.
అయితే, ఇటీవల శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే, అతని అన్నయ్య, ప్రధాని మహింద రాజపక్సే నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ నాయకుడు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనకు రెండు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని, మంత్రులు ఆర్థిక పరిస్థితికి సమిష్టి బాధ్యత వహించడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.