శ్రీలంకలో ఎమర్జెన్సీని దేశ అధ్యక్షుడు గొటబావా రాజపక్సే విధించారు. దేశంలో శాంతి పరిరక్షణకు, ప్రజా భద్రత, నిత్యావసర సేవల నిర్వహణకు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
దేశంలో నిరసనకారులను అణచివేసేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అమెరికా రాయబారి జూలీ చంగ్ ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు శ్రీలంక ప్రజలకు ఉందన్నారు.
‘ ప్రజాస్వామ్య వ్యక్తీకరణ కోసం శాంతియుత నిరసన అవసరం. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాను’ అని తెలిపారు.
రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వారు సంయమనం పాటిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. త్వరలో ఆర్థిక స్థిరత్వం వస్తుందని, ప్రజలకు బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ప్రజలు భావిస్తున్నారు. అందుకే అధ్యక్షుడు రాజపక్సే తన పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శాంతిభద్రతలు క్షీణించడంతో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు రాజపక్సే ఒక గెజిట్ విడుదల చేశారు.