జై శ్రీరామ్ నినాదాలతో పాతబస్తీ వీధులు మార్మోగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి శోభయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ రామాలయంలో స్వామివారి కల్యాణం అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. రాత్రి 7 గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యాయామశాలకు ఇది చేరుకోనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు యాత్రను పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రదేశాలలో, పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు, కమాండ్ కంట్రోల్ సెంటర్.. నిఘా డ్రోన్ కెమెరాల సహాయంతో కన్నేసింది. అదనంగా, ఐటీ సెల్ సోషల్ మీడియా బృందం, స్మాష్ బృందం శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లపై నిఘా ఉంచింది.
శోభాయత్ర బోయగూడ కమాన్, మంగళ్ హాట్ జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్ధంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ కోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది.
ఇక ఆకాశ్ పురి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో మరో శోభాయాత్ర కొనసాగుతోంది. శోభయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించారు. వాహనదారులు, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.