శ్రీరామ పుష్కర పట్టాభిషేకానికి నదీ జలాల సేకరణ పూర్తి అయింది. తొమ్మిది మంది అర్చక వైదిక సిబ్బంది 12 రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణిల జలాలు, సముద్ర జలాల తీర్థాన్ని సేకరించి ఆదివారం భద్రాద్రి చేరుకున్నారు. అనంతరం భద్రాద్రిలో శోభాయాత్ర నిర్వహించారు.
బ్రిడ్జి సెంటర్ లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో నదీజలాలకు ప్రత్యేక పూజలు చేసి, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆ నదీజలాలను భద్రాద్రి ఆలయంలో భద్రపరిచారు. ఈ నెల 31న రామాయణ పారాయణం అనంతరం పుష్యమి నక్షత్రంలో శ్రీరాముడికి పుష్కర పట్టాభిషేకం చేయనున్నారు.
60 సంవత్సరాలకు ఒక సారి సేకరించిన నదీ జలాలతో శ్రీరాముడికి పుష్కర పట్టాభిషేకం జరుగుతుంది. ప్రభవ నామ సంవత్సరం 1987లో ఈ పట్టాభిషేకం జరిగింది. అయితే 60 సంవత్సరాలకు ఒక్కసారి అయితే ఈ ఘట్టాన్ని దర్శించే అవకాశం అందరికీ దక్కక పోవచ్చు.
అందుకే ఆలయ పెద్దలు పుష్కరానికి ఓ సారి జరిగేటట్టుగా చేయాలని సంకల్పించి 2011లో మొదటిసారి పుష్కర పట్టాభిషేకానికి నాంది పలికారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 2023లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.