భద్రాచలంలోని శ్రీ సీతారాముల తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న శ్రీ సీతారాముల కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ లకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి, పూజారులు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించారు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి.
కాగా బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉగాది సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు విశేషాభిషేకం నిర్వహించారు అర్చకులు. అనంతరం ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు.
బ్రహ్మోత్సవాలకు ఓంకార ధ్వజారోహణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షా సూత్రముల పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం 118 మంది పండితులకు దీక్ష వస్త్రాలను ఆలయ అధికారులు అందించారు. కాగా ఈ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పంచాంగ శ్రవణం జరిగింది.