స్వర్గం దిగొచ్చింది. భూలోకం వైకుంఠమైంది. వేద మంత్రోచ్ఛారణలు మిన్నంటగా.. సమస్త మంగళ వాద్యాల మధ్య, ముల్లోకాలు మురిసే విధంగా మూడుముళ్ల బంధంతో శ్రీరాముడు సీతమ్మ తల్లి ఒక్కటైన మధురక్షణాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుడు.. రమ్య మనోహరమైన జానకి దేవికి జరిగిన కల్యాణ వేడుక..లోకరక్షకుడైన సర్వాంతర్యామి శ్రీరాముడి పరిణయ వేడుకను ఆవిష్కరింపజేసింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సీతారామస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో రామయ్య, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రెండేళ్ల తర్వాత దేవదేవుడి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించింది.
హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కన్నుల పండువగా సాగిన స్వామివారి కల్యాణ పర్వాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీసీతారామ చంద్రమూర్తి స్వామివార్లకు పంచోపనిషత్తు ద్వారా అభిషేకాలు, మూలవిరాట్‌కు కల్యాణం నిర్వహించారు.
కర్మాన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో రేవంత్‌రెడ్డి పూజలు చేశారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాఖ వరకు శోభాయాత్ర కనులపండుగగా సాగింది. దూల్‌పేటలో లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. మహానగరమంతటా.. జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీ రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖిల్లా రామాలయంతో పాటు దోమకొండ, భిక్కనూర్, కామారెడ్డి, బీర్కూర్ మండలాల్లో అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నల్గొండలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని జనం భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అనేకమంది వేడుకల్లో పాల్గొన్నారు.
హనుమకొండలో వైభవంగా కల్యాణ క్రతువు జరిపించారు అర్చకులు. కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో దర్గాలో శ్రీరామనవమి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం నేతాజీ నగర్ బాపూరెడ్డి నగర్‌లో ఘనంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు వీక్షించారు.
శ్రీరామనవమిని పురస్కరించుకుని మంచిర్యాలలో మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కాషాయ జెండా ఎగురవేస్తూ జై శ్రీరామ్ నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. భైంసాలో శోభాయాత్రల దృష్ట్యా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ రాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంపీ సోయం బాపురావు శోభాయాత్ర ప్రారంభించారు.
కొండగట్టులోనూ రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో స్వామివారి శోభాయాత్రలు ఘనంగా జరిగాయి. ఎలాంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.