జాతీయ జంతువుగా పులికి బదులుగా ఆవును ప్రకటించి తీవ్రవాదాన్ని అంతం చేయాలనే ఓ కొత్త డిమాండ్ పుట్టుకొచ్చింది. కర్ణాటకలోని ఉడుపి లో జరిగిన సాధు సమ్మేళనంలో ఉడుపిలోని శ్రీ పెజావూర్ మఠ్ కు చెందిన శ్రీ విశ్వేషా తీర్ధ స్వామిజీ ఈ డిమాండ్ చేశారు. సమ్మేళనంలో శ్రీ విశ్వేషా తీర్ధ స్వామిజీ మాట్లాడుతూ…పులికి, తీవ్రవాదికి ఒకే లక్షణాలుంటాయని…పులిని జాతీయ జంతును చేయడం వల్ల మనం పొరపాటు చేశామన్నారు. పులికి బదులుగా ఆవును జాతీయ జంతువు చేయాలని కోరారు. ప్రేమకు, అమాయకత్వానికి ప్రతీకైన ఆవును జాతీయ జంతువుగా గుర్తిస్తే ఈ దేశంలో ఇక టెర్రరిస్ట్ లు పుట్టుకురారని జోస్యం చెప్పారు.
గ్లోబల్ వార్మింగ్ కు మాంసాహారమే కారణమన్నారు. పశు వధను నిషేధించడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. బాబర్ నుంచి ఔరంగాజేబ్ వరకు పశు వధలు జరిగాయని ఉదహరించారు. పశువుల సంరక్షణ, గంగా ప్రక్షాళన భారతీయులకు అత్యంత ప్రధానమైన అంశాలన్నారు. బాబా రామ్ దేవ్ తో పాటు దేశంలోని పలువురు స్వామీజీలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.