పెంపుడు జంతువులు చనిపోతే ఏ పంచాయతీ సిబ్బందికో, ముస్పాలిటీవాళ్ళకో తృణమో పణమో ముట్టజెప్పి చేతులు దులిపేసుకుంటారు. మహా అయితే వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు రెండు కన్నీటి చుక్కలు కారుస్తారు. వాటిని కూడా మనుషులతో సమానంగా ట్రీట్ చేసి కర్మకాండలు చేసే వారెవరుంటారు..?!కానీ శ్రీకాకుళం జిల్లాలో నెయ్యిల నారాయణరావు అనే ఓ జంతు ప్రేమికుడు మాత్రం ఈ విషయంలో మినహాయింపు.
తాను ప్రేమతో పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోతే..దాన్ని కూడా కుటుంబ సభ్యుడిలా భావించి కర్మకాండలు నిర్వహించాడు. తన స్వగ్రామమైన నరసన్నపేటలోని హనుమాన్‌నగర్‌లో కర్మకాండలు, పెదకర్మ నిర్వహించి మానవత్వాన్ని, మమకారాన్ని చాటుకున్నాడు.
నారాయణ రావుకి కుక్కలు పెంచడం అలవాటు. అయితే సంక్రాంతి రోజున తన పెంపుడుకుక్క మృతి చెందింది. శాస్త్రోక్తంగా దానికి అంత్యక్రియలు పూర్తిచేసి.. 12వ రోజు పెదకర్మ చేశారు. బ్రాహ్మణులతో పూజలు చేయించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టారు.
మానవ జీవితంలో ఎవరైనా మరణిస్తే రక్త సంబంధికులే మరచిపోయే ఈ రోజుల్లో.. ఇలా కుక్కకు కూడా వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కుటుంబంపై జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రజంట్ జనరేషన్లో పెట్ డాగ్స్ ను పెంచుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అవి చూపించే ప్రేమ కల్మషం లేనిది మరి.కాస్త ముద్దు చేస్తే చాలు, మనకోసమవి తమ ప్రాణాలు కూడా ఇచ్చేస్తాయి. రక్త సంబంధీకులే మోసం చేస్తున్న ఈ రోజుల్లో మనపై అవి చూపించే విశ్వాసానికి ఏంచేస్తే రుణం తీరుతుంది.