శ్రీకాళహస్తి ఫిన్ కేర్ చోరీ కేసులో పెద్ద ట్విస్ట్ వెలుగుచూసింది. బ్యాంక్ మేనేజర్ స్రవంతే దొంగ అని తేల్చారు పోలీసులు. పథకం ప్రకారమే ఆమె దొంగతనం డ్రామా ఆడిందని గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే… గురువారం రాత్రి సిబ్బంది విధులు ముగించికొని ఇంటికి వెళ్లారు. అయితే.. స్రవంతి మాత్రం రాత్రి పదిన్నర వరకు అక్కడే ఉంది. ముగ్గురు దుండగులు లోనికి ప్రవేశించారు. స్రవంతిని బెదిరించి కాళ్లు, చేతులు కట్టేసి అక్కడ ఉన్న రూ.85 లక్షల విలువైన బంగారం, నగదు దోచుకుని పరారయ్యారు. ఆమె ఫిర్యాదు మేరకు స్థానిక డీఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పట్టణ, పరిసర ప్రాంతాల్లోని చెక్ పోస్ట్ ల్లో తనిఖీలు జరిగాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.
విచారణలో భాగంగా అసలు దొంగ స్రవంతేనని గుర్తించారు పోలీసులు. గిల్టు నగలు తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంది స్రవంతి. త్వరలో ఆడిటింగ్ ఉండడంతో బండారం బయటపడకుండా ఉండేందుకు చోరీ డ్రామా ఆడింది. చెన్నైకు చెందిన ముగ్గురు యువకులతో దోపిడీకి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. పథకం ప్రకారం వాళ్లు ఆమె ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించి.. 2 కేజీల బంగారం, రూ.5 లక్షల క్యాష్ ఎత్తుకెళ్లారు.
స్రవంతి నుంచి దోపిడీ సొమ్మును రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకే స్రవంతి ఈ పని చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.