లంకలో రావణకాష్టం రగులుతూనే ఉంది. గత కొద్ది కాలంగా లంకలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధాని రాజీనామా చేశారు. అధ్యక్షుడు పారిపోయారు. జనం రోడ్డెక్కారు…సైన్యం కూడా మావల్ల కాదంటూ లొంగిపోతోంది. ప్రస్తుతం లంక పరిస్థితి ఇది.
ప్రస్తుతం లంకకు పెద్ద దిక్కెవరు అంటే..ఎవరూ అనే ప్రశ్నే వినిపిస్తోంది. మొదట ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీగా స్టార్ట్ అయిన నిరసన కాస్తా… రానురాను విధ్వంసంగా మారింది. దీనికి అంతటికి కారణం నువ్వే అంటూ అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు.
గొటా గో హోమ్ అంటూ స్లోగన్లతో మారుమోగించారు. నివాసాన్ని తమ సొంతం చేసుకున్న నిరసన కారులు.. బెడ్‌రూమ్‌లో , కిచెన్‌లో వారికి నచ్చినట్లు చేశారు. సోఫాలపై కూర్చుని మద్యం బాటిళ్లను ఖాళీ చేశారు.
జయసూర్య సైతం:
వీరికి సపోర్ట్‌గా లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య సైతం రోడ్డుపైకి వచ్చి,నిరసన కారులతో చేతులు కలిపారు. ఓ వైపు ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసాన్నిలక్ష్యంగా చేసుకుని… నిలువునా తగలబెట్టేశారు. ఎంపీలపై కూడా దాడులు మొదలయ్యాయి.ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి అండర్ గ్రౌండ్‌లోనికి వెళ్లిపోయారు.
నాలుగు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని ఈ తిరుగుబాటు చర్య మిడతల దండు దాడి చేసినట్లుంది. లంక పోలీసులు ఆందోళన కారుల మీద ప్రయోగించిన టియర్ గ్యాస్‌లు, వాటర్ క్యాన్లు ఏమి భయపెట్టలేకపోయాయి. ఆఖరికి కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం శూన్యం.
ఆఖరికి ఆర్మీని రంగంలోకి దింపినప్పటికీ సీన్ రివర్స్ అయ్యింది. వారు కూడా ఆందోళనకారులకే సపోర్ట్ చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధాని అత్యవసర సమావేశాన్ని ఏర్పరిచినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అక్కడిక్కడే రాజీనామా చేశారు.
ప్రస్తుతం లంకలో అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసినట్టు పీఎంఓ ప్రకటించింది.
మరోపక్క లంక అధ్యక్షుడి ఆచూకీ ఇప్పటివరకూ తెలియలేదు. దశాబ్దాల పాటు కొనసాగిన తమిళ పులుల పోరాటాన్ని అణగదొక్కి… ఆ గర్వంతోనే పీఠాన్నెక్కిన రాజపక్స ఇప్పుడు తన ప్రజల నుంచే తనను కాపాడుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు.
భయంతో ఎలుకలు కలుగులో దాక్కున్నట్లు దాక్కున్నారు. బయటకు కనిపిస్తే ప్రజలు చంపేస్తారన్న భయంతోనే వారు పారిపోయారు. ఆయనే కాదు ప్రధాని రణిల్ కూడా జనానికి భయపడి దేశాన్ని వదిలిపారిపోయే ఛాన్సు లేకపోలేదు.