శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకి మరింత దారుణంగా తయారవుతున్నాయి. నిరసనకారులు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో, ఏ కార్యాలయం మీదకి దూసుకుని వస్తారో తెలియక అధికారులు ప్రాణాలు అరచేత్తుల్లో పెట్టుకుని బతుకుతున్నారనే చెప్పవచ్చు.
తాజాగా లంకలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కొలంబోలోని ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే కార్యాలయంలోకి నిరసన కారులు ప్రవేశించారు. ఆందోళన కారులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి.. ప్రధాని కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
ప్రధానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వారిని చెదరగొట్టేందుకు లంక పోలీసులు బాష్పవాయువును ప్రయెగించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ప్రధాని కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు.
అసలేం జరిగిందంటే…
ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి అంటొనోవ్ 32 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో మాల్దీవులకు బయల్దేరి వెళ్లిపోయారు. మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఆ మిలిటరీ విమానం వెళ్లినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
ద్వీప దేశమైన శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. ఓవైపు ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో వేల సంఖ్యలో దండెత్తడంతో గొటబాయ రాజపక్స తన అధికారిక నివాసాన్ని వదిలి వెళ్లారు. ఇన్ని రోజులు ఆయన నౌకాదళాధికారుల ఆశ్రయంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు షిప్‌లో గడిపారని సమాచారం. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉటంకించడంతో ఆయన దేశం విడిచి మాల్దీవులకు వెళ్లారనే ప్రచారం సాగుతోంది. మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆంటొనొవ్-32లో ఆయన దేశం దాటారని తెలుస్తోంది. మళ్లీ అక్కడి నుంచి మరో దేశానికి బయలుదేరొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
గొటబాయ దేశం విడిచి వెళ్లేముందు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రధాని రణిల్ విక్రమసింఘె ఇవ్వాళ పార్లమెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. రాజపక్స స్థానంలో రణిల్ విక్రమసింఘె అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారని అంటున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకూ ఆయన కొనసాగుతారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.