ఇంటి గుట్టు లంకకు చేటని…ఒకే ఇంట్లో ఉన్న నలుగురి వల్లే ఈరోజు లంక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలుస్తోంది. రాజపక్సేల హయంలోనే లంక పరిస్థితి దిగజారిపోయింది. లంకను దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజపక్సే కుటుంబీకులే ఏలుతున్నారు.
ఒకరు అధ్యక్షుడు.. మరొకరు ప్రధాని.. ఇంకో ఇద్దరు మంత్రులు.. వీరే కాకుండా వీరి కొడుకుల్లోనూ ఇద్దరు అమాత్యులు.. మరొకరు ప్రధాన మంత్రి సిబ్బందికి చీఫ్..! ఇలా రాజకీయ కిటుకులన్నీ వారి రాక్షస చేతుల్లోనే..ఇవి చాలవన్నట్లు బంధువుల పేరుతో అవినీతి..! వీటిన్నంటి ఫలితం శ్రీలంక పరిస్థితి అగమ్యగోచరం..!
కన్నీటి బిందువు అన్న లంక దేశపు పేరును లంక సార్థకం చేసుకొంది. ఇప్పుడు లంక ప్రజలకు కన్నీరే మిగిలాయి. వీటికి కారణం కేవలం రాజపక్సే సోదర చతుష్టయమే.. చమల్, మహీంద, గొటబాయ,బసిల్. వీరిలో మహీంద 2005 నుంచి 2015 వరకు అధ్యక్షుడిగా చేశారు. దాని కంటే ముందు ఆయన 2004-2005 లో ప్రధానిగా చేశారు.
కొద్ది కాలం క్రితం ఆయన అంటే 2019 నుంచి 2021 మధ్య ఆర్థిక శాఖను చేతుల్లో ఉంచుకున్నారు. 2018లోనూ ప్రధాని అయినా మధ్యలో దిగిపోయారు. మళ్లీ ఏడాదికి అదే పదవి చేపట్టి.. ఇటీవలి వరకు కొనసాగారు.
గొటబాయ 2019 నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు. చమల్ నౌకా, విమానయాన, సాగునీటి మంత్రి, పార్లమెంటు స్పీకర్(2010-15)గా వ్యవహరించారు. బసిల్ ఎంపీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థిక, నౌకా, విమానయాన, సాగునీరు.. ఏ దేశంలో అయినా ప్రధాన శాఖలివి.
శ్రీలంకలో ఇవన్నీ రాజపక్సే సోదరుల ఆధీనంలోనే ఉండేవి. ఇక వారు ఆడింది ఆట పాడింది పాట గా తయారయ్యింది. వారి చేతలతో లంక పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల తయారయ్యింది. లంక వైభవం మొత్తం కొడిగట్టుకుపోయింది.
వీటన్నంటికి తోడు 2009 వరకు శ్రీలంకను లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఉగ్రవాదం ఒక ఊపు ఊపింది.మహీంద అధ్యక్షుడిగా ఉండగా ఆ ఏడాది ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ సహా మొత్తం ఈలంను తుదముట్టించారు. దీంతో సింహళ జాతీయవాదులకు మహీంద హీరో అయిపోయారు. ఇదే కమ్రంలో దేశంలో ఆయన సోదరుల పెత్తనం పెరిగింది.
హంబన్‌టోటా పోర్టు పటాటోపంభౌగోళికంగా, చారిత్రకంగా భారత్‌కు అతి దగ్గరగా ఉండే శ్రీలంక.. రాజపక్సేల జమానాలో మన దేశాన్ని కాదని చైనాకు దగ్గరైంది. ఇదే అదనుగా లంకలో చైనా పెట్టుబడులు పెట్టింది. రాజపక్సేల సొంత ప్రాంతం హంబన్‌టోటా. తీర నగరమైన ఇక్కడ చైనా ఆర్థిక దన్నుతో వీరు పెద్ద నౌకాశ్రయాన్ని నిర్మించారు.
కానీ, చెల్లింపుల్లో విఫలమై చివరకు డ్రాగన్‌కు ధారాదత్తం చేశారు. కాగా, మహీంద జమానాలో ఎక్కువ శాతం చైనా పెట్టుబడులను సోదర చతుష్టయం, కుటుంబ సభ్యులు విదేశాలకు తరలించారనే ఆరోపణలున్నాయి.
గొంతెత్తితే అంతే..
ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ గతంలో లంక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు. మహీంద అధ్యక్షుడయ్యాక గొటబాయ సైన్యానికి తానే అధినేత అన్నట్లుగా వ్యవహరించారు. ఎల్టీటీఈపై యుద్ధం సమయంలో గొటబాయ సారథ్యంలో సైన్యం అంతులేని అరాచకాలు సాగించినట్లు విమర్శలు వచ్చాయి.
ప్రభుత్వ తీరుపై గొంతెత్తిన వారిని తెల్ల వ్యాన్లలో తరలించి.. అదృశ్యం చేసేవారన్న ఆరోపణలున్నాయి. 2019లో గొటబాయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వ్యవసాయాధారిత దేశమైన లంకలో.. సేంద్రియ సాగు మాత్రమే చేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఎరువుల దిగుమతులను ఆపేశారు. అయితే, ఈ విధానం బెడిసికొట్టి పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఆహార కొరత ఏర్పడింది. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది