ఆమధ్య పడవను అంబులెన్స్ గా మార్చి దాల్ సరస్సులో సేవలందిస్తున్న వ్యక్తి గురించి విన్నాం కదా.. కరోనా కష్టకాలంలో బాధితులకు నేనున్నానంటూ సాయం చేస్తున్న ఆ వ్యక్తి మరో మంచి కార్యక్రమానికి పూనుకున్నాడు. కుమార్తెతో కలిసి దాల్ సరస్సును కాపాడుతున్నాడు.
శ్రీనగర్ కు చెందిన తారిక్ అహ్మద్ పట్లూ ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా బారిన పడ్డాడు. ఆ సమయంలో అతను ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. తాను పడ్డ కష్టం ఇంకెవరూ పడకూడదని.. తనకు ఆదాయాన్ని తెచ్చి పెట్టే పడవను అంబులెన్స్ గా మార్చేశాడు. అందులో ఆక్సిజన్ సిలిండర్ తో పాటు పలు వైద్య పరికరాలు సమకూర్చాడు. అలా ప్రజలకు సేవలందిస్తూ వస్తున్నాడు పట్లూ. ఈ క్రమంలోనే దాల్ లేక్ ను కూడా సంరక్షించుకోవాలనే ఆలోచన వచ్చింది.
పట్లూకి ఎనిమిదేళ్ల జన్నాత్ అనే కుమార్తె ఉంది. ఆ చిన్నారితో కలిసి దాల్ సరస్సులో పర్యావరణ పరిరక్షణ చేపట్టాడు. జన్నాత్ రోజూ బోటులో తిరుగుతూ మైక్ ద్వారా పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది. దయచేసి ప్లాస్టిక్ సంచులను, చెత్తను సరస్సులో వేయొద్దు.. ఇది మా ఇల్లు అని చెబుతోంది.
పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఓ గంట పాటు ఇలా పడవలో వెళ్లి పర్యాటకులకు వివరిస్తోంది జన్నాత్. ఒకవేళ ఎవరైనా ప్లాస్టిక్ ను, పేపర్లను పడేసినా.. వాటన్నింటినీ తీసుకొచ్చి చెత్తకుండీలో వేస్తోంది. వీళ్లిద్దరు చేస్తున్న సేవల గురించి తెలిసిన వారంత ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పట్లూ గురించి గత నెలలో మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ సైతం కొనియాడారు.