శ్రీశైలం వరద నిర్వహణ సక్రమంగా ఉన్నదా ? లేదా ? అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం 6 గేట్లు ఎత్తినందున కెపాసిటీ సరిపోదని అంటున్నారు. మరిన్ని గేట్లు ఎత్తకపోతే కర్నూలుకు వరద ముప్పు ఉండవచ్చునన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
కర్నులు: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో 6 క్రస్ట్ గేట్లు 23 అడుగులు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2.98 లక్షల కూసెక్కులు వుంటే, ఔట్ ఫ్లో స్పిల్ వే ద్వారా 3.20 లక్షల క్యూసెక్కులు ఉంది. పోతిరెడ్డిపాడు, జల విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం ఔట్ ఫ్లో 4.25 లక్షల క్యూసెక్కులు ఉంది.
ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదిలివేస్తున్నారు. ఇన్ ఫ్లో 3.77 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2.94 లక్షల క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 589.20 అడుగులు, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.
మరో వైపు పులిచింతల నుంచి దిగువకు 50 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ 45 గేట్ల ద్వారా 18 వేల క్యూసెక్కులు నీరు వదులుతున్నారు.
ప్రస్తుతం వరద నీరు ఉధృతంగా రావడంతో శ్రీశైలం క్రస్ట్ గేట్ల పైనుంచి నీళ్లు ఇవతలికి దూకుతూ వస్తున్నాయి. ఇలావుంటే, మొహర్రం అందరికీ సెలవు దినం కావడంతో శ్రీశైలంలో డ్యామ్ గేట్లు ఎత్తారన్న సమాచారంతో రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు జల దృశ్యాన్ని చూడ్డానికి పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.