ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జన జీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు గత నాలుగు రోజులుగా నీటి ప్రవాహం పెరుగుతుంది. గురువారం సాయత్రం వరకు 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. శుక్రవారం తెల్లవారు జాము నుంచి కృష్ణమ్మ ఉగ్రరూపంగా మారింది. దీంతో శుక్రవారం ఎగువ నుంచి వరద మరింత అధికంగా వస్తున్న నేపథ్యంలో 10 క్రస్ట్ గేట్లను, 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు.
కాగా శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.90 అడుగులకు చేరింది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 215.807 కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 215.3263 టీఎంసీల సామర్థ్యంకు నీరు చేరుకున్నది.
అలాగే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,987 వేల క్యూసెక్కులు, అలాగే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,325 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు.