శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపై ఆన్‌లైన్‌లో 750, ఆఫ్ లైన్‌లో 250 టికెట్లు జారీ చేయనుంది. ఇప్పటికే 500 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా జనవరి 11న మరో 250 టికెట్లు విడుదల చేయనుంది.
మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమనాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటరును అందుబాటులో ఉంచారు.
బోర్డింగ్ పాస్ ద్వారా ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో మాత్రమే ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్‌కి బోర్డింగ్ పాస్‌ను జతచేయాలి. టికెట్‌పై ఎయిర్‌లైన్ రిఫరెన్స్‌తో కూడిన పీఎన్‌ఆర్ నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సిబ్బంది బ్రేక్ దర్శన టికెట్‌తో పాటు బోర్డింగ్ పాస్‌ను తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వెయ్యికి పరిమితం చేసినట్టు టీటీడీ వెల్లడించింది.