తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. కోవిడ్ కారణంగా 2020లో నిలిచిపోయిన ఈ టికెట్లను మళ్లీ రెండేళ్ల తర్వాత వదిలారు ఆలయ అధికారులు. ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలకు సంబంధించి.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను నేరుగా భక్తుల కోసం టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకోవచ్చని టీటీడీ సూచించింది. టికెట్ల విక్రయం పూర్తయిన తర్వాత వారి జాబితాను 22వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత వెబ్ సైట్ లో ఉంచుతామని పేర్కొంది. సేవా టికెట్లు పొందిన భక్తులు రెండ్రోజుల్లోపు ధర చెల్లించాల్సి ఉంటుందని.. భక్తులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందుతుందని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పండుగలు, పర్వదినాల సమయంలో ఈ ఆర్జిత సేవలు రద్దు కానున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 2వ తేదీ ఉగాదిని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం.. ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజుల తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు.. ఏప్రిల్ 14 నుంచి 16 వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు.. ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.