తాళ్లపాకకు పూర్వ వైభవం తీసుకువస్తామని టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య విగ్రహం వద్ద శ్రీవారి ఆలయం నిర్మించి, అర్చకుడు, భద్రత, ఇతర సిబ్బందిని నియమిస్తామన్నారు. ఉగాది సందర్భంగా 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని వైవి సుబ్బారెడ్డి సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. అలాగే, నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుగాడిన ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రతిరోజు ఆ ప్రాంతంలో అన్నమయ్య సంకీర్తనలు వినిపించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని సుబ్బారెడ్డి సూచించారు. అన్నమయ్య విగ్రహానికి రంగులు, నిత్య సంగీత కార్యక్రమాలు, పచ్చదనాన్ని పెంపొందించి తాళ్లపాకకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని సుబ్బారెడ్డి చెప్పారు. తాళ్లపాకలో కూడా అభివృద్ధి పనులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత టీటీడీలో విలీనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అన్నమయ్య మార్గాన్ని నడక, వాహనాలల్లో వెళ్లేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఇక అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.