సినిమా ఇండస్ట్రీలో కృషితో పాటూ, ఎక్కువ మార్కులు లక్కుకు కూడా ఉంటాయన్నది తెర ఎరిగిన సత్యం. కాంబినేషన్, డ్రెస్ కోడ్, పాటలు, సంగీత దర్శకుడు, స్టూడియో… ఇలా ఒకటేమిటి… “కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల… కాదేదీ కవితకనర్హం” అన్న లెవెల్లో లెక్కలేనన్ని క్రేజీ సెంటిమెంట్స్ కనిపిస్తాయ్, వినిపిస్తాయ్, మతి పోగొడతాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఓ సెల్టిమెంటే దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఫాలో అవుతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది.
బాహుబలి ది బిగినింగ్ సినిమాలో, మంచులో ఛేజింగ్ సన్నివేశాలు గుర్తున్నాయా? అదేనండీ మిల్కీ బ్యూటీ తమన్నా పచ్చబొట్టు పాటకు ముందు వచ్చే సన్నివేశాలు. యస్… ఆ లొకేషన్ బల్గేరియా దేశానికి సంబంధించినది. తన్ కెరీర్లో అతి పెద్ద హిట్టుగా చరిత్ర సృష్టించిన బాహుబలి కోసం షూట్ చేసిన అదే లొకేషన్లో ఇప్పుడూ తన తాజా భారీ చిత్రం “ఆర్.ఆర్.ఆర్” కోసం కొన్ని సీన్స్ షూట్ చేయబోతున్నాడట. లక్కు కలిసొస్తుందనే ఆ లొకేషన్ తను సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడని ఒక వార్త నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది.
అయినా భారతదేశం వీరులు కొమురం భీం, అల్లూరి లను బల్గేరియా ఎలా తీసుకెళ్తాడో, కథలో ఆ సన్నివేశాలకు లింకేస్తాడో వేచి చూడాలి. అయినా జక్కన్న మాంచి కథాగమన శిల్పి కదా, ఏదో భారీ స్కెచ్చే వేసే ఉంటాడు. అయితే మరో వైపు బాహుబలి సన్నివేశాలు బల్గేరియాలో చిత్రీకరిస్తున్నప్పుడే రాజమౌళికి ఆ ప్రదేశాలు నచ్చడంతో ఎందుకైనా మంచిదని అక్కడి కొన్ని లొకేషన్స్ ని సందర్శించి రావడం జరిగిందంటున్నారు. ఇప్పుడూ ఆ లొకేషన్స్ లోనే ఆర్.ఆర్.ఆర్ షూట్ చేస్తున్నాడట. ఇక సినిమా విషయానికొస్తే షూటింగ్ అనుకున్నంత వేగంతో సాగడం లేదని, ఎక్కువగా అవాంతరాలు వస్తూ ఉండడం వల్ల చాలా నెమ్మదిగా సాగిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకనుండీ ఎలాంటి బ్రేక్స్ రాకుండా ప్లాన్ చేసుకుని, షూటింగ్ త్వరగా పూర్తిచేసి, తాననుకున్న తేదీకే విడుదల చెయ్యాలన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. చెయ్యబోయే తాజా షెడ్యూల్లో సినిమా లోని ఇద్దరు హీరోలు రాంచరణ్ అండ్ జూనియర్ ఎంటీయార్ పాల్గొనబోతున్నట్టు సమాచారం.