దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించనుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. మరో నటుడు అజయ్ దేవగణ్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అందాల భామ అలియా భట్ నటిస్తుండగా..ఎన్టీఆర్ కు జోడీగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటించనున్నారు. అలాగే తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ ఏడాదిలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలను విశాఖ అడవుల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. కాగా ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే ముందుగానే దర్శకుడు రాజమౌళి మరో సినిమాకు కమిట్ అయ్యారనే వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్, మహేష్ బాబులతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించే యోచనలో రాజమౌళి ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా ‘బాహుబలి’ని మించేలా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నా.. ఈ ముగ్గురు కలయికలో సినిమా అని తెలియగానే అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా రాజమౌళి తరువాత ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ నటించనున్నారని…ఈ చిత్రంలోకి మహేష్ బాబును కూడా తీసుకొని మల్టీస్టారర్ మూవీని నిర్మించే యోచనలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమా కూడా పట్టాలెక్కితే అభిమానుల పండగ చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.