రాజమౌళి… ఈ పేరు సంచలనాలకు మారు పేరు. టీవీ సీరియల్స్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టి, అతి తక్కువ సమయంలోనే ఎవరు అందుకోలేనంత, కనీసం ఊహించలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి మొదలుకొని రీసెంట్ బాహుబలి 2 వరకు రాజమౌళి సినిమాలన్నీ సూపర్ సక్సెస్ సాధించిన సినిమాలే. అపజయం ఎరుగని దర్శకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతున్న రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు యావత్ భారత సినీ ప్రపంచం ఎదురుచూస్తుంది. బాహుబలి 2 విడుదలైన దాదాపు రెండు సంవత్సరాల వరకు తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పని రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో “ఆర్.ఆర్.ఆర్” ప్రకటించి అందరికి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
సాధారణంగా ఇద్దరు సమఉజ్జిలైన స్టార్ హీరోలని ఒకే సినిమాలో తీసుకున్నప్పుడు సహజంగా అందరికి తలెత్తే ప్రశ్న ఇందులో ఎవరి రోల్ ఎక్కువ అని… రాజమౌళి ఇద్దరికి సమానమైన రోల్స్ ఉంటాయని చెప్పినా….. బయట సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ వేరేలా వుంది. ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ వేగంగా జరిగినప్పటికీ తరువాత నుంచి ఆలస్యం అవుతూ వస్తుంది. 2020 జూలై 30న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు కాబట్టి.. వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే… ఈ చిత్రంలో రాంచరణ్ పాత్ర కంటే ఎక్కువ ప్రాధాన్యత ఎన్టీఆర్ పాత్రకే ఇస్తున్నట్టు గట్టిగా వినిపిస్తోంది.
అందరికీ అర్ధమైన స్పష్టమైన సంగతి ఏంటంటే.. చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో తక్కువగా పాల్గొంటున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. కానీ తెలంగాణా పోరాటవీరుడు కొమరం భీం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలీదు కాబట్టి…. ఈ పాత్రపైనే రాజమౌళి ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ను ఎంచుకోవడం వెనుక ఆయన ఉద్దేశం కూడా అదే అని తెలుస్తుంది. కొమరం భీం రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాడని ఒక ఊహజనితమైన ఆలోచన. అతని స్వభావం కూడా అదే అని అంటారు. కొమరం భీంను కొత్తగా చూపించేందుకు రాజమౌళి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం కొమరం భీం… అదే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్స్‌ను బల్గేరియాలో షూట్ చేస్తున్నారు. అక్కడ ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి.
ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ యాక్షన్ సీన్ల చిత్రీకరణ జరుగుతుంది. సెప్టెంబర్ మొదటి వారం వరకూ అక్కడే షూటింగ్ జరుగబోతుందట. అక్టోబర్ 22న కొమరం భీం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నారని సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దాదాపుగా 400 కోట్ల అతి భారీ బడ్జెట్‌తో ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.