సినిమా అనేది వినోదం మాత్రమే కాదు. కొంత మంది మేధస్సు, ఎంతో మంది అంతర్మథనం, నెలల శ్రమ, వందల మంది పరిశ్రమ, కోట్లపెట్టుబడి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టకుని దర్శకుడు తెరకెక్కించినా ప్రేక్షకులు థియేటర్ కి వస్తారన్న గ్యారెంటీలేదు. కానీ ఒక దర్శకుడు పేరు చెప్తే చాలు ప్రేక్షకుడు కళ్ళు మూసుకుని సినిమాకి వెళ్తాడు. కళ్ళప్పగించి సినిమా చూస్తాడు.అతను తెలుగు సినిమా దశదిశా మార్చిన దర్శకుడు. ఆ దర్శక ధీరుడు మరెవరో కాదు రాజమౌళి.దర్శకత్వం వహించిన మొదటి చిత్రం నుంచి నిన్నమొన్నటి ట్రిపుల్ ఆర్ వరకూ అన్నీ దిగ్విజయాలే. కానీ RRR చిత్రం ప్రత్యేకం.
విడుదలై ఇన్ని రోజులవుతున్నా ఆర్ఆర్ఆర్ పేరు అంతర్జాతీయ వేదికలపై మార్మోగుతోంది.ఈ చిత్రంలోని “నాటునాటు” పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రరాజంపై హాలీవుడ్ దిగ్గజం, అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రశంసల జల్లు కురిపించారు.
అమెరికాలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో రాజమౌళి, జేమ్స్ కామెరూన్ కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ రెండుసార్లు చూశానని ఆయన తనతో చెప్పారని రాజమౌళి మురిసిపోతూ ట్వీట్ చేశారు. “ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. ఆ సినిమాను చూడమని తన భార్య సుజిక్ జేమ్స్ కు చెప్పిన ఆయన ఆమెతో కలిసి మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీ చూశారట. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కామెరూన్ 10 నిమిషాల పాటు నాతో విశ్లేషించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్ అయిన ఆయన నన్ను ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఇద్దరికీ థాంక్యూ ” అని రాజమౌళి ట్వీట్లో రాసుకొచ్చారు.