తెలంగాణలో పదో తరగతి ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 (గురువారం) టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు విడుదలైన రెండు రోజుల్లోనే టెన్త్ ఫలితాలు విడుదల కానుండటం గమనార్హం.
కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్న వైనం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణత సాధిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.
ఇంటర్ ఫలితాలు..:
ఈరోజు ఉదయం తెలంగాణలో ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను విడుదల చేశారు. రెండు సంవత్సరాలలో కూడా బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ లో 63.32 శాతం, సెకండియర్ లో 67.16 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 72.35 శాతంగా ఉండగా.. రెండో సంవత్సరంలో 75.28 శాతంగా నమోదైంది. అలాగే.. మొదటి సంవత్సరంలో బాలురు 54.20 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 60శాతం బాలురు పాసయ్యారు.
ఈసారి ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. హన్మకొండ రెండో స్థానాన్ని సాధించింది. ఆగస్ట్ ఒకటి నుంచి సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా వల్ల రెండేళ్లు అందరం ఇబ్బందిపడ్డామని.. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్ లైన్ లో విద్యా బోధన చేశామన్నారు. ఈ ఏడాది 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించామన్న ఆమె.. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించామని తెలిపారు.