తమిళనాడు సీఎంగా స్టాలిన్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఆర్టీసీ బస్సులో ఆయన శనివారం ప్రయాణించారు. ఈ ఏడాది కాలంలో తన పాలన ఎలా ఉందో బస్సులోని ప్రయాణీకులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మెరీనా బీచ్ కు ఆయన చేరుకున్నారు. అక్కడ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే పార్టీ వ్యవస్థాపకులు అన్నాదురైకి ఆయన నివాళులు అర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి ఆయన వెళ్లారు.
సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా అసెంబ్లీలో ఆయన ఐదు కీలక ప్రకటనలు చేశారు. ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఆయన ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వమే ఉదయం టిఫిన్ ఉచితంగా పెడుతుందని తెలిపారు.
రాష్ట్రంలో పలు అత్యుత్తమ స్థాయి పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పట్టణాల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లాంటివి ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో పాటు ‘మీ నియోజక వర్గంలో ముఖ్య మంత్రి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వివరించారు.