అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ అంత్యక్రియలు ఆయన సొంత నగరం కెర్మాన్ ల మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 35 మంది చనిపోయారు. 48 మంది గాయపడినట్టు ఆ దేశ టెలివిజన్ ప్రసారం చేసింది. సులేమానీ అంతిమయాత్ర కొనసాగుతుండగా ఎంతో మంది రోడ్డుపై జీవశ్చవాలుగా పడి ఉన్నారు. వారిని రక్షించండంటూ కొందరు అరుస్తున్న దృశ్యాలను టెలివిజన్ ప్రసారం చేసింది. ఇరాన్ రాజధాని టెహరాన్ లో సోమవారం సులేమానీ మృతదేహాన్ని సందర్శించుకోవడం కోసం 10 లక్షల మంది హాజరయ్యారు.
గత శుక్రవారం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమాని చనిపోవడంతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. దీనికి బదులుగా ఇరాన్ ఎలాంటి చర్యలకు పాల్పడినా.. ఆ దేశంలోని 52 కీలక ప్రాంతాలపై దాడి చేస్తామని అమెరికా హెచ్చిరించింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంతో మధ్య ప్రాచ్యంలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి.