ఎఫ్-3.. గతంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్-2 సినిమాకు సీక్వల్‌గా రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సూపర్ ఫన్ ఎంటర్‌టైనింగ్‌గా ఎఫ్-2ను తెరకెక్కించారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో ఎఫ్-3 సినిమాతో రెట్టింపు వినోదాన్ని అందించేందుకు అనిల్ రావిపూడి, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది.
ఇప్పటికే ఎఫ్-3 సినిమాలో గ్లామర్ డోస్ పెంచడానికి దిల్ రాజు ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇందు కోసం స్టార్ హీరోయిన్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలనుకుంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో ఆ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారట. త్వరలోనే ఆ సాంగ్ చిత్రీకరణ ఉంటుందని సమాచారం. ఎఫ్-2 బ్లాక్ బస్టర్ కావటంతో ఎఫ్-3 సినిమాతో కూడా దిల్ రాజు హిట్ కొట్టాలని బలంగా అనుకుంటున్నారు. అందుకోసమే ఎఫ్-2లో ఉన్న తారాగణంకు ఎక్స్‌ట్రా యాడ్ చేస్తూ వస్తున్నారు దిల్ రాజు.
పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరు. కానీ, ఆమె స్పెషల్ సాంగ్స్ చేయడంలోనూ ఆసక్తి చూపిస్తారు. గతంలో రంగస్థలంలో రామ్ చరణ్‌తో కలిసి జిగేల్ రాణి.. అంటూ ఆడి పాడారు. ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి సై అన్నట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు రిక్వెస్ట్ మీద ఎఫ్-3 సినిమాలో డాన్స్ చేయడానికి ఈ బుట్టబొమ్మ ఒప్పుకుని ఉండొచ్చు.
ఇప్పటికే ఎఫ్-3లో హీరోయిన్స్‌గా తమన్నా, మెహరీన్ నటిస్తుండగా సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. కాగా, ఇప్పుడు పూజా హెగ్డే చేరిందంటే గ్లామర్‌కు అస్సలు కొదవే ఉండదని ఫిక్స్ అయిపోవచ్చు. మరి ఈ వార్తలపై ఇటు పూజా హెగ్డే, అటు దిల్ రాజు టీమ్ కానీ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.