ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగనుంది. ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రగతిభవన్ లో రాష్ట్రమంత్రి వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించి మంత్రివర్గం చర్చించి, ఆమోదం తెలుపనుంది.
ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ‘ఈసారి’ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ‘ఎన్నికల బడ్జెట్’ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల కోణంలో మరోమారు భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.బడ్జెట్‌పై ఈ సమావేశంలో చర్చించి ఏ రంగానికి ఎంత కేటాయించాలనేది నిర్ణయించనున్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.3 లక్షల కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. రైతన్నకు దన్నుగా నిలిచే పథకాలకు, సంక్షేమ రంగాలకు, గృహనిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. పంట రుణమాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. అదేవిధంగా సాగునీటి రంగానికి రూ.10 వేల కోట్లు , రుణాల రూపేణా మరో రూ.10 వేల కోట్లు సేకరించనున్నట్లు తెలిసింది.
6న బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. బడ్జెట్‌పై అధ్యయనం కోసం సభ్యులకు 7న సభకు సెలవు ప్రకటించారు. 8న బడ్జెట్‌పై సభలో చర్చ చేపడతామని, అదే రోజు ఆర్థిక శాఖ మంత్రి చర్చకు వివరణ ఇస్తారని సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. ఇక 9, 10, 11 తేదీల్లో వివిధ శాఖల పద్దులపై చర్చ చేపడతారు. ఈ నెల 12న ‘ద్రవ్య వినిమయ బిల్లు-2023’ను ప్రవేశపెడతారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నెల 9 నుంచి ప్రతి రోజూ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు.