తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర నేతల అభిప్రాయం తీసుకొని ఢిల్లీ వెళ్లిపోయిన ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ఏఐసీసీ ప్రెసిడెంట్ సోనియాకు రిపోర్ట్ ఇచ్చేశారు. ఇంతటితో బాల్ సోనియా కోర్టులోకి వెళ్లిపోయిందని అంతా భావించారు.
కానీ పీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు కనపడుతుండటంతో ఆశావాహులంతా ఢిల్లీ బాట పడుతున్నారు. ఇంచార్జ్ ఠాగూర్ ఢిల్లీ రావొద్దని చెప్తున్నా… ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి చేరుకుంటున్నారు.
ఢిల్లీ వెళ్లిన నేతలు ఎవరెవరంటే…
1. రేవంత్ రెడ్డి, ఎంపీ (రేవంత్ రెడ్డి ప్రొగ్రాం ముందే ఫిక్స్ అయ్యింది. ఆయన డిఫెన్స్ కమిటీ మీటింగ్ కు హజరు కావాల్సి ఉంది. ఇదే కమిటీలో రాహుల్ గాంధీ కూడా సభ్యులుగా ఉన్నారు. దీంతో వీరిద్దరు ముందస్తు అపాయింట్మెంట్ లేకున్నా కలుస్తున్నారు.)
2. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ. పీసీసీ చీఫ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి… సోనియా, రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ను కూడా కలవనున్నారు.
3. భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత. ఈయన పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు.
4. శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి- పీసీసీ రేసులో ఉన్న శ్రీధర్ బాబు సోనియాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం సాగుతుంది.
5. సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే. సంపత్ ను ఏఐసీసీ పిలిపించిందన్న ప్రచారం సాగుతుంది.
6. జగ్గారెడ్డి సహా ఇతర నేతలు కూడా ఢిల్లీ బాట పట్టనున్నారు.