జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లను గుర్తిస్తూ గెజిట్ దాఖలు చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని బీజేపీ గవర్నర్ తమిళి సై కి ఫిర్యాదు చేసింది. వెంటనే గెజిట్ ఇచ్చి, రాజ్యంగ సంస్థల గౌరవాన్ని కాపాడాలని కోరారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరుస్తూ… ఎన్నికల సంఘంతో కలిసి సీఎం కేసీఆర్ దొంగనాటకాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం కలిసి పోటీ చేసిందని, ఎంఐఎం సహాకారం లేకపోతే టీఆర్ఎస్ కు ఈ సీట్లు కూడా వచ్చేవి కావని బండి సంజయ్ ఆరోపించారు. బూత్ కాప్చర్లు చేశారనన్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉందంటున్న వారు అంత ముందస్తుగా ఎన్నికలకు ఎందుకు వెళ్లారని బీజేపీ ప్రశ్నించింది. హాడావిడి ఉందని, వరదల్లో ఉన్న ప్రజలను కాపాడిన తర్వాత ఎన్నికలకు వెళ్ధాం అంటే కూడా వినకుండా ఎన్నికలకు వెళ్లారని, బీజేపీ గెలవకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బండి సంజయ్ ఆరోపించారు.
ఎన్నికలు పెట్టిన వారు కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం చేయనివ్వకుండా, మేయర్ ఎన్నికను చేయకుండా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.