– రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్
– తప్పనిసరి ఆస్తుల వెల్లడిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
– ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన
– విద్యాశాఖ మంత్రి ప్రకటన
– దీనికంతటికీ కారణం ఓ టీచర్
– అక్రమార్జనకు అలవాటు పడ్డ టీచర్
– టీచర్స్ అందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ
– ప్రతిపక్షాలు ఆందోళన
– వెనక్కి తగ్గిన ప్రభుత్వం
తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల కు ఆస్తులను ప్రతీ ఏటా ప్రకటించాలని రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖ సర్క్యులర్ ను జారీ చేసింది. ఈ ప్రకటన తీవ్ర వివాదస్పదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు, ప్రతిపక్షాలు ఖండించాయి. దీంతో యూ టర్న్ తీసుకున్నా కేసీఆర్ ప్రభుత్వం.. ‘తప్పనిసరి ఆస్తుల వెల్లడి’ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అక్రమార్కులను కట్టడి చేయలేక అందరిపై భారం వేయడం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సర్కారు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు.
నిజానికి ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తుల వివరాలను సమర్పించడమన్న నిబంధన కొత్తేం కాదు. ప్రతి ఏడాది మార్చిలో టీచర్లు తమ ఆస్తుల వివరాలను ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్ కు గానీ.. ఎంఈవోకు గానీ సమర్పించాలనే నిబంధన గతం నుండే ఉంది. అయితే.. నల్లగొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ అలీ.. అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. టీచర్ల ఆస్తులపై సర్క్యులర్ జారీ చేసినట్టు తెలుస్తోంది.
అయితే.. జావీద్ పాఠశాలకు హాజరుకాకుండా రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించి నివేదిక విద్యాశాఖకు సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ వర్తించేలా విద్యాశాఖ ఈ నెల 8న సర్క్యులర్ ను జారీ చేసింది. ఇకపై ఉపాధ్యాయులెవరైనా స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొంది.
సర్వే నంబర్లతో సహా అన్ని స్థిర ఆస్తులతో పాటు.. కారు, బైక్, బంగారం, ఇంట్లో వస్తువులు, పెట్టుబడులు, షేర్లు, లావాదేవీలు వంటి అన్ని వివరాలను ప్రకటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంటూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. రాజకీయ నేతల రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీచర్స్ ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమవుతుండగా.. ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో టీచర్స్ యూనియన్లు భగ్గుమన్నాయి. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుందని ఆరోపించారు. మరోవైపు సీఎం కాకముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎన్ని.. సీఎం అయ్యాక ఎన్ని ఉన్నాయి అనేది బహిరంగంగా వెల్లడించాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు నిలదీశారు.
ఇదిలా ఉంటే.. టీచర్ల ఆస్తులపై విద్యాశాఖ సర్క్యులర్ జారీకి కారణమైన జావీద్ అలీ సర్వీస్ మొదటి నుంచీ వివాదాల్లోనే నెట్టుకొస్తున్నాడు. దేవరకొండ పట్టణానికి చెందిన అలీ.. తొలుత కానిస్టేబుల్ గా పనిచేశారు. అప్పట్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే కారణంతో సస్పెండ్ చేశారు. దీంతో 1996 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చందంపేట మండలం పెద్దమునిగల్ ప్రాథమిక పాఠశాల, తిమ్మాపూర్, కాట్రవానితండాలో విధులు నిర్వర్తించిన అలీ.. ప్రస్తుతం గుంటిపల్లి పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఉపాద్యాయునిగా పనిచేస్తూనే.. రాజకీయంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు.
ఇటు టీఆర్ఎస్ లో చురుగ్గా ఉంటూ.. ఓ కీలక నేత అండదండలతో రియల్ ఎస్టేట్ లోకి ప్రవేశించిన జావీద్.. భారీగా ఆస్తులు కూడగట్టుకున్నాడనే విమర్శలు వినిపించాయి. దీంతో ఆయనపై విజిలెన్స్ కు పిర్యాదు అందింది. విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు అది నిజమేనని నిర్ధారించారు. అంతేకాకుండా.. పాఠశాలకు గైర్హాజరవుతూ పార్టీ నేతలతో తిరగడం.. ఎన్నికల్లో ఒక నాయకున్ని గెలిపించేందుకు బహిరంగంగా ప్రయత్నాలు చేయడంతో.. ఉపాధ్యాయ సంఘాలు పూర్తి ఆధారాలతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాయి. దీంతో అప్రమత్తమైన జావీద్.. తన ఆస్తులను బినామీల పేరున బదలాయించారని స్థానికంగా వందతులు షికార్లు చేస్తున్నాయి.