- సామాన్యుల చావుకు బాధ్యత కేసీఆర్ దే : బండి
- ప్రాణాలు తీస్తున్న రాబందులను ఏం చేద్దాం..? : ప్రవీణ్ కుమార్
జోగులాంబ గద్వాల పట్టణంలోని మూడు కాలనీల్లో మిషన్ భగీరథ ద్వారా ఐదురోజులుగా కలుషిత నీరు సప్లయ్ కావడంతో.. ఆ నీటిని తాగిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో పరిస్థితి విషమించి నర్సింగమ్మ, సీకలి కృష్ణ అనే ఇద్దరు బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు, నీటి సరఫరా సిబ్బందికి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం వెరసి సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. దీంతో ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్థతపై గళమెత్తాయి.
కలుషిత నీరు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బిజెపి చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న కలుషిత నీరుతాగి ఇద్దరు మృతిచెంది, 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురవ్వడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ”నీ అసమర్ధ పాలనతో కనీసం గుక్కెడు మంచి నీళ్ళు ఇయ్యలేని అధ్వాన్న స్థితికి తీసుకొచ్చినవ్. నువ్వా నదులకు నడక నేర్పింది?. ప్రచారాలు చేస్కోవడంలో ఉన్న శ్రద్ధ పని మీద లేకపాయే?. ఈ చావులకు భాద్యత నీదే దొరా. ఈ కుటుంబాల గోస వినపడ్తుందా?, ఇంకెందరు బలైతే నిద్ర లేస్తవ్?” అంటూ ట్విట్టర్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఇదే ఘటనపై టీఆర్ఎస్ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ”5 లక్షల కోట్ల అప్పుచేసినా తినడానికి ఒక ముద్ద మంచి బువ్వ, గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరుకుతలేవు కేసీఆర్ బంగారు తెలంగాణల!!! మరి మన డబ్బులను తిని మన ప్రాణాలను తీస్తున్న రాబందులెవరు? వాళ్లనేం చేద్దాం?” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
కాగా, జోగులాంబ గద్వాలలోని 3 కాలనీల్లో రెండు రోజుల నుంచి పరిస్థితి దయనీయంగా మారింది. నీరు కలుషితం తీవ్రం కావడంతో వాంతులు, విరేచనాలతో గద్వా ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పెద్ద సంఖ్యలో బాధితులు క్యూ కట్టారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.