”మాటి మాటికి మేము వచ్చి మిమ్మల్ని డబ్బులు అడగడం మాకే ఇబ్బందిగా ఉంది” అంటూ ఐదు రాష్ట్రాల ఆర్ధిక శాఖా మంత్రులు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులలో నిర్మలా సీతారామన్ ఈరోజు సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వల్ల కొన్ని రాష్ట్రాలకు కలిగే నష్టాలను కేంద్ర ప్రభుత్వం పరిహారంగా చెల్లిస్తుంది. ఆ నష్ట పరిహారం సక్రమంగా అందకుండా ఆలస్యమవుతుండడంతో ఆయా రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు నిర్మలా సీతారామన్ కు విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పారు. ”నష్ట పరిహారం క్రమంగా అందకపోవడంతో తాము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని..అలాగని తాము జైళ్లను, స్కూళ్లను, హాస్పిటల్స్ ను మూసివేయలేమని” రాష్ట్రాల ఆర్ధిక మంత్రులన్నారు. ”రాష్ట్రాలకు చాలా బాధ్యతలున్నాయని..ప్రతి రోజు ఢిల్లీకి రాలేమని..మీరు అంతా మంచిగుందనుకోకండి…మేము మంచిగా లేమని” అన్నారు. జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడే కొన్ని రాష్ట్రాలకు ఐదేళ్ల వరకు నష్ట పరిహారం చెల్లించేలా బిల్లులో హామీ ఇచ్చారు. అయినా కేంద్రం ఆలస్యంగా నష్ట పరిహారం చెల్లించడంపై రాష్ట్రాలు అసహనం వ్యక్తం చేశాయి. ఈ విషయం పార్లమెంట్ లో కూడా ప్రస్తావనకొచ్చింది. రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల ఆవేదనను విన్న సీతారామన్ త్వరలో నిధులు అందుతాయని హామీ ఇచ్చారు.