కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలు కరోనా 4వ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ వైరస్ కూడా అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విలయ తాండవం చేస్తుంది. డెల్టా వేరియంట్ కంటే ఈ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఒమిక్రాన్ కేసులు మాత్రం ప్రతిరోజు గణనీయంగా నమోదవుతున్నాయి. ప్రతీ మూడురోజులకు బాధితుల సంఖ్య రెట్టింపు అవుతుంది. దీంతో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, ప్రజలకు కీలక సూచనలు చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు మహమ్మారి వ్యాప్తికి అవకాశం లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది.
ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన వారిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ఈ మహమ్మారి బారిన పడినవారిలో 91 మంది శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని.. ముగ్గురు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని ఆయన అన్నారు. దీన్ని బట్టి వ్యాక్సినేషన్ పూర్తయిన వారు నిర్లక్ష్యంగా ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలని రాజేశ్ భూషణ్ స్ఫష్టం చేశారు. ఇప్పటివరకు దేశంలో 358 కేసులు నమోదవ్వగా.. 114 మంది కోలుకున్నారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని నిబంధనలు పాటించడమే ఈ మహమ్మారి అడ్డుకట్టకు మార్గమని రాజేశ్ భూషణ్ అభిప్రాయపడ్డారు. దేశంలో కేరళ, మిజోరం రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ రేటు చాలా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బూస్టర్ డోసులపై చర్చలు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ డీజే బలరాం భార్గవ్ తెలిపారు. ఈ వేరియంట్ పై వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉంటుందో అనేదానిపై స్పష్టత వచ్చిన తర్వాత బూస్టర్ డోసుల పంపిణీ చేసే ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సూచనలతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 25 నుంచి నైట్ కర్ఫ్యూ పెట్టనున్నట్టు అక్కడ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్న మహారాష్ట్రలో కఠిన అమలవుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఒడిశా కూడా ఇదే బాటలో ఆంక్షలను అమలు చేస్తోంది.