ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో గురువారం త్రివిధ దళాల పరేడ్ కన్నులవిందుగా సాగింది. ఇండోటిబెటన్ ఫోర్స్, ఆర్టిల్లరీ వంటి సాయుధ దళాల సంపత్తిని, వైమానిక, నౌకాదళ సామర్థ్యాన్ని ప్రతిబింబించే శకటాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. పంజాబ్ నుంచి ఆకాశ్ వెపన్ సిస్టం కి సంబంధించిన శకటం విశేషంగా ఆకర్షించింది. 144 మంది యువ నేవీ సిబ్బంది, ముగ్గురు మహిళలతో సహా ఆరుగురు అగ్నివీరులు పరేడ్ కి మరింత విశిష్టత తెచ్చారు.
వివిధ రాష్టాల శకటాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన శకటం అల్మోరా లోని జగదీశ్వర్ డ్యాం ని, కార్బెట్ నేషనల్ పార్క్ ని నమూనాగా చూపింది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని, క్లీన్ గ్రీన్ ఎనర్జీ ఎఫిషియెంట్ ని థీమ్ గా తీసుకుని గుజరాత్ శకటం, టూరిజం, సేంద్రియ వ్యవసాయాన్ని థీమ్ గా తీసుకుని త్రిపుర రూపొందించిన శకటాలు, అలాగే దేవ్ ఘర్ లోని వైద్యనాథ్ ఆలయాన్ని థీమ్ గా తీసుకుని ఝార్ఖండ్ రూపొందించిన శకటాలు కనువిందు చేశాయి..
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, యూపీ వంటి ఇతర రాష్ట్రాల శకటాలు తమతమ సాంస్కృతిక విశేషాలను కళ్ళకు కట్టాయి. ఏపీ నుంచి ప్రభల తీర్థం శకటం విశేషంగా ఆకర్షించింది. అయోధ్యలో జరిగిన మూడు రోజుల దీపోత్సవాన్ని హైలైట్ చేస్తూ యూపీకి చెందిన శకటం సాగింది. భగవద్గీతపై హర్యానా రూపొందించిన శకటం మరో హైలైట్ అయింది. మహాభారతంలోని వివిధ ఘట్టాలను ఈ శకటం ప్రదర్శించింది.
ఇక వివిధ శాఖల సైనిక విభాగాలకు చెందిన జవాన్ల మోటార్ సైకిల్ అద్భుత విన్యాసాలు ఆశ్చర్యం కలిగించాయి. వీరిని డేర్ డెవిల్స్ గా అభివర్ణించారు.