రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, లారీల బంద్ జరిగింది. రాష్ట్రంలో రవాణాశాఖ అధికారులు నిబంధనలతో తమ బతుకుబండి లాగలేకపోతున్నామని ఆటోలు, క్యాబ్‌లు, లారీల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఆయా జిల్లాల్లోని ఆర్టీవో కార్యాలయాల ఎదుట చోదకులు ధర్నాకు దిగారు. కొత్త మోటారు వాహనాల చట్టం అమలును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఖైరతాబాద్ లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు డ్రైవర్లు యత్నించారు. ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, అధికారుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆటోవాలాలు బంద్ పాటించారు. కేంద్రం జారీ చేసిన 714 జీవో వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 6000 ఆటోలు నిలిచిపోయాయి.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వాటికి అదనంగా తమపై ఫిట్నెస్ భారం మోపుతున్నారని ఖమ్మంలో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన వాహన ఫిట్ నెస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్రం తెచ్చిన జీవోను రద్దుచేసి.. జరిమానాల భారం తగ్గించాలని కోరుతూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని.. ఆటో, క్యాబ్ మీటర్ రేట్లు పెంచాలని, అంతరాష్ట్ర సరిహద్దుల్లో సింగిల్ పర్మిట్లు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం ఎదుట ధర్నాలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీలతో పాటు.. అన్ని లారీ యూనియన్లు, క్యాబ్ యూనియన్లు, ఆటో యూనియన్లు పాల్గొన్నాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ధర్నా చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.