శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మోరి మహత్యం
బంటుమిల్లిలో బయటపడిన అమ్మవారి పురాతన విగ్రహం
తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు
విశేష పూజలతో వెలిగిపోతున్నకృష్ణా తీర గ్రామం
విజయవాడ: కృష్ణాజిల్లా బంటుమిల్లి గ్రామంలోని ఓ కాలనీ దగ్గరలో మళ్ళ సూర్యచంద్రరావు అనే వ్యక్తికి చెందిన ఓ ఇంటి దగ్గర జరిపిన తవ్వకాల్లో పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజున ఈ విశేషం చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో జనం నోట్లో బాగా నానుతోంది. దాంతో బంటుమిల్లికి భక్త జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండలంలోని మల్లేశ్వరం గ్రామానికి చెందిన కొండపల్లి అశోక్‌కు గత కొంతకాలంగా అమ్మవారు పూనకంగా వచ్చి బంటుమిల్లిలోని మల్లా సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో ఫలానా చోట 9 అడుగులు తవ్వితే ఐదు పడగలతో వున్న పులిపై కూర్చున్న అమ్మవారి విగ్రహం రూపంలో వస్తానని చెప్పినట్టు కథనం. సరిగ్గా అమ్మవారి ఉత్సవాలు తొలి రోజునే ఈ తవ్వకం చేయాలని పూనకంలో చెప్పినట్లు అశోక్ తెలిపాడట. దాంతో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో తవ్వకాలు జరిపారు. సరిగ్గా తొమ్మిది అడుగుల వెళ్లేసరికి అమ్మవారి విగ్రహం బయటపడింది. ఉదయం ఆరు గంటలకు విగ్రహం బయటకు తీశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా గ్రామంలో వ్యాపించింది. దీంతో పరిసర ప్రాంత భక్తులు రావడం మొదలెట్టారు. అది ఇంకా పాకి మండలంలోని పలు గ్రామాల వాళ్లు తండోపతండాలుగా వస్తున్నారు.
ప్రస్తుతం అమ్మవారిని దర్శించేందుకు అక్కడ క్యూ కట్టారు. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు చేస్తున్నారు. దసరా ఉత్సవాలు ప్రారంభం కావటం, సరిగ్గా అదే రోజు ఈ ప్రాంతంలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో ఈ ప్రాంత వాసులలో ఆనందం కనిపిస్తోంది.